ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత

  • వరుసగా నాలుగో ఐపీఎల్ సీజన్‌లో 600 ప్ల‌స్ ర‌న్స్‌ పూర్తి చేసిన కోహ్లీ
  • గుజరాత్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ర‌న్ మెషిన్‌ 
  • గతంలో గేల్, కేఎల్ రాహుల్ మూడుసార్లు మాత్రమే ఈ ఫీట్ 
  • ఐపీఎల్‌లో మొత్తం ఆరు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన విరాట్ 
  • ఈ జాబితాలో నాలుగు సీజన్లతో రెండో స్థానంలో రాహుల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్, ర‌న్ మెషిన్‌ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వరుసగా నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. నిన్న‌ ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ, తనదైన శైలిలో ఆడి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో 600 పరుగుల మార్కును చేరుకోవడానికి అతనికి 43 పరుగులు అవసరం కాగా, ఈ మ్యాచ్‌లో సరిగ్గా 43 పరుగులే చేసి ఔటవ్వడం గమనార్హం. కేవలం 25 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, తొమ్మిదో ఓవర్ రెండో బంతికి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అంతకుముందే ఎనిమిదో ఓవర్‌లోనే అతను ఈ అరుదైన ఫీట్‌ను పూర్తి చేశాడు.

ఈ ఘనతతో ఐపీఎల్‌లో వరుసగా మూడు సీజన్లలో 600కి పైగా పరుగులు చేసిన క్రిస్ గేల్, కేఎల్ రాహుల్‌ల రికార్డును కోహ్లీ అధిగమించాడు. గత మూడు సీజన్లలో కూడా విరాట్ అత్యంత నిలకడగా రాణించాడు. 2023లో 639 పరుగులు, 2024లో 741 పరుగులు, 2025 సీజన్‌లో 657 పరుగులు సాధించి తన ఫామ్‌ను కొనసాగించాడు.

వరుస సీజన్లే కాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 600కు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను మొత్తం మీద ఆరు సీజన్లలో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ నాలుగు సీజన్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ పంజాబ్ కింగ్స్ తరఫున మూడుసార్లు (2018, 2020, 2021), లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఒకసారి (2022) ఈ మార్కును అందుకున్నాడు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ 14 మ్యాచ్‌ల్లో 593 పరుగులు చేసి 600 పరుగుల మార్కుకు కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

Virat Kohli
IPL 2026
Royal Challengers Bangalore
RCB
Gujarat Titans
Dharamshala
Chris Gayle
KL Rahul
IPL Records
Batting Record

More Telugu News